నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు జరపడానికి అవసరమయిన ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నాం – రజత్ కుమార్

0
520
Spread the love

తెలంగాణ శాసనసభకు చెందిన 119 నియోజక వర్గాలకు ఈనెల 7వ తేదీన  జరుగుతున్న ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, పారదర్శకంగా, నిష్ఫక్షపాతంగా జరపడానికి అవసరమయిన ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ తెలియ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను చైతన్య పరచడానికి విస్తృతంగా కృషి చేసినందువల్ల గత ఎన్నికలకంటే ఈ సారి పోలింగ్ శాతం పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ కేవలం హక్కుగానే కాకుండా ఓటర్లు బాధ్యతను గుర్తించి ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

తుది సవరణల తరువాత రాష్టంలో 2కోట్ల 80లక్షల 64వేల 684మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,41,56,182 కాగా స్త్రీలు 1,39,05,811 మరియు ఇతరులు 2691. రాష్ట్రంలోని 31 జిల్లాలో విస్తరించి ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడానికి వివిధ రాజకీయపార్టీల తరఫున, స్వతంత్రంగా కూడా 1821మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ 42 మందితో మల్కాజ్‌గిరి లో అత్యధికులు పోటీలో ఉండగా, కేవలం 6మందితో బాన్స్ వాడ అత్యల్పంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.

ఈ ఎన్నికలలో ప్రప్రథంగా ఇవిఎంలతో వివిప్యాట్‌లను  ప్రవేశపెట్టడంతో, ఇవిఎంల వాడకంపట్ల జనసామాన్యంలో ఉన్న అనేక అపోహలను తొలగించడానికి, అవగాహన కల్పించింది ఎన్నికల కమీషన్. వీటిని చాలాచోట్ల చాలా రోజులు ప్రజలకు అందుబాటులో ఉంచి నమూనా పోలింగ్ నిర్వహించినా ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. ఇప్పడు మొత్తం 44,415 బ్యాలట్ యూనిట్లను (7557అదనంగా) , 32,016 కంట్రోల్ యూనిట్లను(4432,అదనంగా) 32,016 వివిప్యాట్ల(5261, అదనంగా)  ఓటర్లు ఉపయోగించుకోబోతున్నారు. అలాగే ఈ యంత్రాలను తయారు చేసిన బి.ఇ.ఎల్/ఇసిఐఎల్ సంస్థలకు చెందిన 240మంది ఇంజనీర్లను అన్నిచోట్ల అందుబాటులో ఉంచారు.

ఇక సాఫ్ట్ వేర్ విషయంలో కూడా అత్యంత ఆధునికంగా ఏర్పాట్లు చేసారు. ఎన్నికల నియమావళి తదితర ఉల్లంఘనలపై ఫిర్యాదులను అత్యంత వేగంగా అధికార యంత్రాగం దృష్టికి తీసుకురావడం అంతే వేగంగా అది స్పందించి చర్యలు తీసుకోవడంతోపాటూ ఫిర్యాదు దారుకు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పడు చేరవేయడానికి తోడ్పడే సి-విజిల్‌ అనే యాప్‌ను, ఓటరు తన ఓటు, పోలింగ్ కేంద్ర తదితర వివరాలు, ర్యూట్‌మ్యాప్‌లతో సహా తెలసుకోవడానికి ఉపకరించే ‘నాఓటు’ అనే యాప్‌ను, రాజకీయపార్టీలు, అభ్యర్థులకు అనుమతులు త్వరగా తెచ్చుకోవడానికి వీలు కల్పించే సువిధ, సుగమ్ అనే యాప్‌లను  ఈ సారి ప్రవేశ పెట్టడం, వాటికి విపరీతమైన ఆదరణ లభించడం కూడా జరిగింది. దాదాపు 8వేల ఫిర్యాదులు సి-విజిల్ కు అందగా వాటిలో 5872 ను పరిష్కరించి ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారులకు వెంటనే చేరవేయడ జరిగింది.

2018 సంవత్సరాన్ని ‘అందరికీ (దివ్యాంగులతో సహా) అందుబాటులో ఎన్నికలు’’ పేరిట నిర్వహించడంతో దివ్యాంగులకు ఈ  ఎన్నికలలో చేస్తున్న ఏర్పాట్లను చూసి వారిలో ఉత్సాహం, ఆత్మ విశ్వాసం  ద్విగుణీకృతం అయ్యాయి. వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్ళడం, తీసుకురావడం, అక్కడ ర్యాంప్‌లు, వీల్‌ఛైర్లు వారికి సహాయంగా దాదాపు 29541వేలమంది స్వచ్ఛంద సహాయకుల నియామకం వంటివాటితో 4,57,809 మంది దివ్యాంగ ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఆత్రుతగా ఉన్నారు. 

ఇక మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రారంభంకాబోతుంది. కేవలం 13 నియోజక వర్గాల్లో ఉదయం 7గంటలనుండి సాయంత్రం 4గంటల వరకు మిగిలిన అన్ని చోట్ల ఉదయం 7నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగునుంది.

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ మాటల్లో చెప్పాలంటే… ‘‘ప్రజాస్వామ్యం దేవాలయం వంటిది. ఎవరో చెప్పారని కాకుండా, ఎవరో బలవంతం పెట్టారనో, తాయిలాలు ఇచ్చారనే కాకుండా, అంతరాత్మ ప్రబోధంతో గుడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినంత పవిత్రంగా ప్రతి ఒక్కపౌరుడూ పోలింగ్ కేంద్రానికి బాధ్యతతో వెళ్ళి ఓటు వేసి రావాలి’’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here