‘ఢీ’ అంటే ‘ఢీ’ అంటున్న సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థులు

0
546
Spread the love

ల‌ష్క‌ర్ కోటాను చేజిక్కించుకునే రాజ‌కీయ వీరుడెవ్వ‌రు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి టి.ప‌ద్మారావు మ‌రోసారి సికింద్రాబాద్‌లో జెండా ఎగుర వేస్తారా?..ప్ర‌జాకూట‌మి త‌ర‌పున కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్ తొలిసారి గెలిచి జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే అయ్యాన‌ని అనిపించుకుంటారా?.. ఈ ఇద్ద‌రు మ‌హామ‌హుల న‌డుమ క‌మ‌లం విక‌సిస్తుందా?.. ఆ పార్టీ నేత బండ‌ప‌ల్లి స‌తీష్ గ‌ట్టెక్కుతారా.. ఏం జ‌ర‌గ‌బోతోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సికింద్రాబాద్ న‌గ‌రానికి ఓ ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంది. సికింద్రాబాద్ న‌గ‌రంలో ఆగ్నేయంలో సికింద్రాబాద్ స్టేష‌న్ త‌రువాత చిల‌క‌ల‌గూడ నుండి మొద‌లై లాలాపేట్‌..తార్నాకా.. ఓయూ ప‌రిధిలోని మాణికేశ్వ‌రిన‌గ‌ర్‌, జామై ఉస్మానియా.. పార్సీగుట్ట‌, వారాసిగూడ‌, సీతాఫ‌ల్‌మండి ప్రాంతాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. తొలి నుండి కాంగ్రెస్‌.. పార్టీకి ఆ త‌రువాత తెలుగుదేశం పార్టీల‌కు పెట్ట‌ని కోట‌ల్లా ఉన్న సికింద్రాబాద్‌లో 2004లో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో తొలిసారి .పద్మారావు టీఆర్ ఎస్ ఖాతా తెరిచారు. 2008 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. తిరిగి 2014లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.

2014లో హైద‌రాబాద్ న‌గ‌రం నుండి టీఆర్ ఎస్ త‌ర‌పున‌ ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ప‌ద్మారావు. గ్రేట‌ర్ ప‌రిధిలో సికింద్రాబాద్ తోపాటు మ‌ల్కాజిగిరి, ప‌టాన్ చెరు స్థానాలు మాత్ర‌మే టీఆర్ఎస్కు ద‌క్కాయి. అయితే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా పోటీ చేసిన కూన వెంక‌టేష్ గౌడ్ ఓట‌మి పాల‌య్యారు. స్థానికేత‌రుడైనందున జ‌నం ఆయ‌న్ని ఆద‌రించ‌లేదు. మ‌రోప‌క్క ప‌ద్మారావు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఆయ‌న విజ‌యానికి కార‌ణం అయింది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నందున టీఆర్ ఎస్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క‌లా ఉంటుందా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

కానీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌దికోట్ల‌తో రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా తొలిసారిగా పేద‌ల కోసం ఉచితంగా ఇవ్వ‌డానికి ఏసీ ఫంక్ష‌న్ హాల్‌ను నిర్మించ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో జూనియ‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేయ‌డం , ప‌వ‌ర్ బోర్ల వంటి అనేక అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేసినందున ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా నిలుస్తార‌ని ప‌ద్మారావు ధీమాతో ఉన్నారు.అభివృద్ధి ప‌నుల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రితో ఆప్యాయంగా ఉంటూ వారి మంచి చెడుల‌ను కుటుంబ విష‌యాలుగా భావిస్తూ తోడ్పాటును అందిస్తూ వ‌స్తున్నందున త‌న మంచిత‌న‌మే త‌న విజ‌యానికి కార‌ణం అవుతుందంటున్నారు టి.ప‌ద్మారావు, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి.

అయితే డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల విష‌యంలో కొంత ఇబ్బంది ఎదురుకానుంది. ప్ర‌ధానంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌దివేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను నిర్మించాల‌నుకున్నారు ప‌ద్మారావు. కానీ.. ఖాళీ స్థ‌లం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 4వంద‌ల ఇళ్ల‌ను మాత్ర‌మే క‌ట్ట‌గ‌లిగారు. ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని ప్ర‌చార‌స్త్రంగా వాడుకోవాల‌నుకుంటున్నారు. కాంగ్రెస్‌తోపాటు.. బీజేపీ నాయ‌కులు కూడా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌తోపాటు.. వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌చారానికి వినియోగించుకోనున్నారు.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున కాసాని జ్ఞానేశ్వ‌ర్ పోటీ చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుండి అనేక సార్లు పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు. గ‌తంలో ఒక‌సారి న‌ర్సాపూర్ నుండి స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌జాకూట‌మి త‌ర‌పున కాసాని పోటీ చేస్తున్నా.. టికెట్లు ద‌క్క‌క నిరాశ‌లో ఉన్న మాజీ మేయ‌ర్ బండ‌కార్తీకారెడ్డితోపాటు ఇత‌ర కాంగ్రెస్ శ్రేణులను కాసాని బుజ్జగించడంతో వారు ఆయన వెంట ప్రచార కార్యక్రమాల్లో పాక్హొంటున్నారు. అట్లాగే టీడీపీ నేత‌లూ ప్రచార పర్వంలో కాసాని వెంటే ఉన్నారు. ప్ర‌ధానంగా స్థానికేత‌రుడైనందునే కాసానికి కొంత ఇబ్బంది త‌ప్పెట్టు లేదు.

అయితే కాసాని సామాజిక‌వ‌ర్గానికి చెందిన ముదిరాజులు నియోజ‌క‌వ‌ర్గంలో 27వేల వరకు ఉన్నారు. కానీ వీరంతా కాసానికి ఓటువేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. 2008లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన పిట్ల కృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి కేవ‌లం స్వంత సామాజిక వ‌ర్గాన్ని మాత్ర‌మే న‌మ్ముకుంటే క‌ష్టాలు త‌ప్పెట్టు లేదు. అయితే టీడీపీ-కాంగ్రెస్‌ల‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ , టీజేఎస్ మద్దతు, ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరిగిన వ్య‌తిరేక‌త త‌న విజ‌యానికి దోహ‌ద‌ప‌డుతుందంటున్నారు కాసాని

మరోవైపు సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారు 15 వేల వరకు రైల్వే ఉద్యోగులు నివసిస్తున్నారు. రైల్వే మజ్దూర్ సంఘ్ కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతున్నందున ఆ వర్గాల ఓట్లు కాసానికి పడతాయా అనేది తేలాల్సి ఉంది. అట్లాగే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే క్రిస్టియన్ మైనారిటీ ఓటర్ లూ ఈసారి కాంగ్రెస్ కు అండగా నిలిస్తే కాసాని పంట పండినట్లే అన్నారు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి.

మ‌రోవైపు గ‌తంలో టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చిన బీజేపీ ఈసారి స్వంత అభ్య‌ర్థిని రంగంలోకి దింపింది. బండ‌ప‌ల్లి స‌తీష్ ను పార్టీ అభ్య‌ర్థిగా నిలిపింది. దేశంలో మోడీ అమ‌లు చేస్తున్న ఆయుశ్మాన్భవ, ఆవాస్ యోజ‌న వంటి సంక్షేమ ప‌థ‌కాలు.. ఆయ‌న పాల‌నా తీరుతో సికింద్రాబాద్‌లో ఖ‌చ్చితంగా తాను విజ‌యం సాధిస్తానంటున్నారు స‌తీష్ గౌడ్‌. మంత్రి ప‌ద్మారావు నియోజ‌క‌వ‌ర్గం ప‌ట్ల తీవ్ర నిర్ల‌క్ష్యం చేయ‌డంతో స‌మ‌స్య‌లు తాండ‌విస్తున్నాయంటున్నారు స‌తీష్‌. ఇక్క‌డి ప‌రిస్థితులే త‌న గెలుపుకు కార‌ణం అవుతాయంటున్నారు.. అయితే ఒంట‌రిగా పోటీ చేసి గెలిచే స‌త్తా బీజేపీకి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉందా అనే తేలాల్సి ఉంది.

ఏమైన‌ప్ప‌టికీ గ‌తంలో క‌న్నా ఈసారి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్ ఎస్‌ల‌ను గెలిపిస్తూ వ‌చ్చిన ఇక్క‌డి ప్ర‌జ‌లు ఈసారి ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో..చూడాలి మరి.

Watch Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here