పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంత చేయాలి

0
58
Spread the love
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంత చేయాలి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్*


*హైదరాబాద్, జూన్ 01:* 
   జిహెచ్ఎంసి పరిధిలో  ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు చేపట్టే పట్టణ ప్రగతి  కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధుల సహకారంతో  విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

జిహెచ్ఎంసి కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కమిషనర్,  జోనల్, డిప్యూటీ కమిషనర్ లతో  ఏర్పాటు చేసిన సమావేశంలో  హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలతో మంత్రి తలసాని పట్టణ ప్రగతి ఏర్పాట్ల పై  సమీక్షించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు సురభి వాణీ దేవి, భూపాల్ రెడ్డి, శాసన సభ్యులు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కౌసర్  మోహినుద్దీన్, మోజమ్ ఖాన్ రాజా సింగ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో గ్రేటర్ వ్యాప్తంగా 150 వార్డులో ఉన్న 4846 కాలనీలలో నియమించిన 391 టీమ్స్, జిహెచ్ఎంసి సిబ్బంది ద్వారా కాలనీలలో గార్బేజ్ కలెక్షన్, నాలా పూడికతీత, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు, పాఠశాల లు, కమ్యూనిటీ హాళ్లలో క్లీనింగ్ కార్యక్రమాలతో పాటు ఎంటమాలజీ విభాగం ద్వారా దోమల వ్యాప్తి నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని తెలిపారు.  

వీధి కుక్కల వల్ల కాలనీవాసులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం  కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగేలా, ఉదయం నుండి సాయంత్రం వరకు  గార్బేజ్ తరలింపుకు వాహనాలు పనిచేసేలా చూడాలని తెలిపారు. వాహనాల డ్రైవర్ల నెంబర్ ని శాసన సభ్యులకు అందజేయాలని తెలిపారు. అవసరమైతే అదనపు వాహనాలు సమకూర్చాలని అన్నారు. రానున్న వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలలో  ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లంగర్ హౌస్ చెరువు  సుందరీకరణ మాదిరిగానే  టోలిచౌకి  షాతమ్ చెరువులో గుర్రపు డెక్క తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. రానున్న వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని  నాలా పూడికతీత పనులు వందకు వందశాతం పూర్తిగా  చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

శాసన సభ్యులు దానం నాగేందర్,   కౌసర్ మొహియుద్దీన్ సూచనల  మేరకు హకీం దర్గా రిటైనింగ్  నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు. డివిజన్ వారీగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్ని వార్డులలో భవన నిర్మాణ వ్యర్థాలు, గ్రీన్ వేస్ట్, క్యాచ్ పిట్ తదితర సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో చిన్న చిన్న సమస్యాత్మక పనులపై దృష్టి పెట్టాలని, నాలాలను తప్పనిసరిగా సందర్శించాలని, వారంలో మూడు సార్లు జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో  పర్యటించి సమస్యలు  పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో  విజయవంతం చేయాలని,  స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు తీసుకుని ముందుకు పోవాలన్నారు. కాలనీ పర్యటన సందర్భంగా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను కోరారు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సలహాలు తీసుకుని విజయవంతానికి కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో  కే సి ఆర్ రూపకల్పన చేసిన పథకాలు ఆదర్శంగా  నిలుస్తున్నాయని అన్నారు.

అంబర్ పేట్ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి జిహెచ్ఎంసి ద్వారా   ఏర్పాటైన జిహెచ్ఎంసి వాహనాలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్న గార్బేజ్ ను పూర్తిస్థాయిలో తొలగించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం సహాయ పడుతుందన్నారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం రోజువారి పురోగతి పనులపై స్పెషల్ ఆఫీసర్ ద్వారా మీడియా కు సమాచారం అందించాలన్నారు.

కార్వాన్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతిలో వాటర్ వర్క్స్ ద్వారా సీవరేజ్ లీకేజీలు, పొల్యూషన్, లో ప్రెజర్ సమస్య, వీధికుక్కల బెడద, పార్కుల అభివృద్ధి, దోమల వ్యాప్తి నివారణ, నాలా పూడికతీత పనుల పై చర్యలు తీసుకోవాలని తెలిపారు.  

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం పై ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్దరణ పనులు చేపట్టాలన్నారు. రోడ్ నెం. 46 లో సైలెంట్ వ్యాలీ ని పార్క్ గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 బహదూర్ పుర ఎమ్మెల్యే  మహమ్మద్ మోజం ఖాన్  మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టి దోమల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.  అసంపూర్తిగా ఉన్న నాలా పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

గోషామహల్ శాసన సభ్యులు రాజా సింగ్ మాట్లాడుతూ… ప్రతి వార్డు కు రెండు వాహనాలు కాకుండా మరి కొన్ని అవసరం మేరకు పెంచాలని, మూసి నదిలో ప్రవహించే కాలుష్యం నీటి వలన దోమల నివారణకు పిచికారి చేసే మందు పని చేయడం లేదని, దోమల నివారణకు రెగ్యులర్ గా వాడే మందు కాకుండా  ప్రత్యామ్నాయ కెమికల్ ను వాడాలని కోరారు. ఆదర్శ్ కాలనీలో ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని. గౌలిగూడ వద్ద నాలా  పై భాగంలో పూడికతీత చేశారు. కానీ దాని కింది భాగంలో పూడికతీత చేయకపోవడం వలన నీరు నిలిచి మళ్ళీ సమస్య  ఏర్పడినట్లు వివరించారు.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని కాలనీలలో భవన నిర్మాణ వ్యర్థాలు, నాలా పూడికతీత, పారిశుధ్యం పనులు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ… కాలనీలలో చిన్న చిన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతిలో 4846 కాలనీలలో కాలనీ  తిరుగుతూ  శానిటేషన్, గార్బేజ్  పాయింట్ల ను, నిర్మాణ వ్యర్థాలు,  గ్రీన్ వేస్ట్,  వినియోగానికి రాని వస్తువులు శిథిలావస్థలో ఉన్న భవనాలు సేకరించిన  వ్యర్థాల   కోసం తాత్కాలికంగా  పాయింట్ గుర్తించి అక్కడ నుండి  తరలింపు  చేస్తారు . వీధి లైట్లు, బి.టి, సిసి రోడ్లు, నాలా మెష్, నీటి నిల్వ ప్రాంతాలు,  ఆసుపత్రులు ప్రభుత్వ భవనాల ఆవరణలో వ్యర్థాల తొలగింపుతో పాటుగా క్లీనింగ్ పనులు ప్రతిరోజు సిబ్బంది ద్వారా పూర్తి చేయాలన్నారు.

4846 కాలనీలకు గాను 711 కాలనీలలో హరితహారం పూర్తి చేసినట్లు  తెలిపారు. 391 టీమ్ లను ఏర్పాటు చేసినట్లు, ప్రతి వార్డుకు రెండు వాహనాలు ట్రిప్ ల వారీగా కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాయని,  ప్రవేటు  ఖాళీ స్థలంలో చెత్తను, ముళ్ళ పొదలు తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు.  ఈ సమావేశంలో విద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బెవరేజ్  కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్,  జోనల్, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here