నా స్థాయికి తగినవాడు కాదని వదిలేశా బండి సంజయ్ పై సీఎం కెసిఆర్ ఫైర్‌

0
115
Spread the love

 

నా స్థాయికి తగినవాడు కాదని వదిలేశా బండి సంజయ్ పై సీఎం కెసిఆర్ ఫైర్‌


తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట రైతుల అంశంపై స్పందించారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించి, అందుకు అనువైన విత్తనాలు కూడా తెప్పించామని అన్నారు. అయితే యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) చెబుతోందని తెలిపారు. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతోందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక అభ్యంతరాలు పెడుతోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని, వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. “పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. మీరు వరి పంటనే వేయండి… ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం అంటూ రైతులకు చెబుతున్నాడు. ఎవరి మెడలు వంచుతాడు? ఆయనే మెడ వంచుకుంటాడా? లేక కేంద్రం మెడలు వంచుతాడా? ఈయన ఓ ఎంపీ. చాలారోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా. నా స్థాయికి తగిన మనిషి కాదు.. నాకంటే చిన్నవాడు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదు. కానీ ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే స్పందించాల్సి వస్తోంది. ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే చాలా కష్టం. వరి కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. రైతులను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఇవాళ రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు నష్టపోరాదనే వరి వద్దని మంత్రి చెప్పారు” అని కేసీఆర్ వివరించారు.

Telangana Chief Minister K. Chandra Shekhar Rao Press Meet @ Pragathi Bhavan Today

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here