కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోంది – సీఎం కేసీఆర్‌

0
35
Spread the love

ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ..

‘‘యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మంత్రి వివరించారు. కారణం ఏమిటంటే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేది. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. ఆ ప్రక్రియలో మొదటి దశగా భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేశాం. ఆ తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇచ్చాం. చిన్న రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని రూ.1,400 కోట్లు వెచ్చించి.. రైతు బీమా పథకం ద్వారా రైతుల ప్రీమియం కూడా చెల్లిస్తున్నాం. విత్తనాలు కూడా దొరికేవి కావు, కల్తీ విత్తనాలు అమ్మేవారు. కేంద్రంతో పోరాడి, ఒప్పంచి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చాం. ఎరువులు దొరికేవి కావు. పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టి ఎరువులు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగింది. అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేశాం. ఇలా అనేక చర్యలు చేపట్టాం. దీంతో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ’’ అని కేసీఆర్‌ అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బాయిల్డ్ రైసు కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పిందన్నారు. ఇవన్నీ తెలియకుండా తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.‘‘బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలి. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? సంజయ్‌ వ్యక్తిగతంగా దుషించినా ఇన్నాళ్లు క్షమించాను. నా స్థాయి కాదని వదిలేశా. ఇప్పుడు తెలంగాణ రైతాంగం నష్టపోయే విధంగా మాట్లాడుతున్నారు’’ అని చెప్పారు. ఈ మేరకు యాసంగిలో వరి క్షేమం కాదని రైతులకు సీఎం సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here