గోదావరి ప్రాభావిత 4 జిల్లాల కలెక్టర్లతో సి.ఎస్. సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

0
51
Spread the love

గోదావరి ప్రాభావిత 4 జిల్లాల కలెక్టర్లతో సి.ఎస్. సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్ జులై 14: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేడు సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో భద్రార్డీ కొత్తగూడెం నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సంబంధిత సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌ లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నందున అన్నిప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసేలా అదనపు కంటింజెంట్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు.
రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మానవ ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో పాటు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వద్ద రేపటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ముంపుకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని అదనపు పరిమాణంలో కొనుగోలు చేసి, వాటిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, అదనపు డీజీలు జితేందర్‌, సంజయ్‌ జైన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విధ్యుత్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్‌ ఈఎన్‌సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here