గుండెల్లో చెప్పలేనంత బాధను దిగమింగుతున్న గల్ఫ్ కార్మికులు

0
325
Spread the love

ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఇంకెప్పుడు.?

పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఇంటికి పరుగెత్తుకొచ్చిన నాకు ఇంటిలొని పరిస్థితులు చూసి దిగులేసింది.పై చదువులు చదువుకోవాలన్న ఆశ చచ్చిపోయింది.అయిష్టంగానే మావాళ్ళు నన్ను ఇంటర్లో( collage) చేర్చిన కుటుంబ పరిస్థితుల కారణంగా చదువ మధ్యలోనే మానేసిన సంఘటణ నన్ను ఇప్పటికి భాదిస్తున్న విషయమే. ఎలాగైనా కుటుంబాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతో సతమతమవుతున్న నాకు ఒక మిత్రుని ద్వారా గల్ఫ్ జిందగి పరిచయం అయింది.దూరపు కొండలు నునుపు అనే చందంగా వారు చెప్పిన మాటలు నన్ను ఆకర్షించాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు అయిన గల్ఫ్ నన్ను ఊరిస్తుంది.కలల ఊయలలో తేలియాడిస్తుంది.అలాంటి సమయంలో మిత్రుల ద్వారా పరిచయమైనా ఏజెంట్ ద్వారా అక్షరాల లక్ష రూపాయలు చెల్లించి 2003 లో దుబాయికి పయనమయ్యాను.ఉన్న ఊరును, కన్న వాళ్ళను ,స్నేహితులను వదలి వెళ్ళడం ఇష్టం లేకున్న కుటుంబ పరిస్థితుల కారణంగా బాధ పడుతూనే పరాయి దేశానికి బయలుదేరాను.ఇంకా జీవితం అంటే ఏంటో తెలియని వయస్సు ,బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియదు తెలుగు తప్ప మరే భాష రాదు పని అనుభవం లేదు చదువా అంతంతమాత్రమే కాని డబ్బులు సంపాదించాలనే ఆశ మాత్రం నన్ను ఎడారి బాట పట్టించాయి.అక్కడకు చేరిన మొదటి రోజే ఎందుకు వచ్చానా అనే విధంగా అక్కడి వాతావరణ పరిస్థితులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి.మొత్తానికి ఒక మెకానికల్ కంపనిలో Helper గా పనిలో జాయిన్ అయ్యాను.హెల్పర్ అంటే సహాయకుడు అని కదా అర్థం .కంపనివారు నన్ను టెక్నిషన్ దగ్గరకు హెల్పర్గా పంపేవారు. వారు మాట్లాడే భాష నాకు అర్థంకాక వారు ఏంచెప్తున్నారో తెలియక సరిగా పని చేయలేకపోయేవాడిని.దాని కారణంగా అందరూ నన్ను తిరస్కరించేవారు.పై అధికారులేమో ఇలాగైతే ఎలాగని మందలించేవారు.అప్పుడు అర్థం అయింది డబ్బు సంపాదించడం అంత సులువు కాదని.తిరిగి వెళ్ళాలనే అలోచన నాలో అప్పుడే మొదలైంది .కారణం పని దగ్గర ఎదురౌతున్న సమస్యలు ఒకటైతే నేను అనారోగ్యానికి గురికావడం ,అక్కడి వాతావరణం తట్టుకోలేక , ఆహారం సహించక మంచాన పడిన తీరి నాకు ఇప్పటికి గర్తు.అలాంటి సమయంలో ఒక హైదరాబాద్ మిత్రుడు పరిచయమవ్వడం అతడు నాలో ధైర్యాన్ని నింపి చక్కని సలహాలు ఇబ్వడం వలన కొంత కోలుకుని కసితో భాషా నైపుణ్యం వైపు అడుగులు వేస్తూనే పనిలో పట్టు సాధిస్తు ఒక Helper స్థాయి నుండి supervisor స్థాయి వరకు ఎదిగిన క్రమం నన్ను ఇప్పటికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నాయొక్క గల్ఫ్ జిందగిలో ఇవన్ని ఒకెత్తయితే మరి కొన్ని సంఘటనలు నన్ను పూర్తిగా కలచివేశాయి.* చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు రాలేక , అప్పులు తీర్చలేక తోటి మిత్రులు పడుతున్న భాదలు కన్నీరు తెప్పించేవి. * ఒక మిత్రుడు ఎక్కువగా ఆలోచిస్తూ పిచ్చి వాడుగా మారి అక్కడి వీధుల్లో తిరుగుతున్న ఘటణ నన్ను పిచ్చి వాన్ని చేసాయి. అతని పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయేది. * మరొ సంఘటణ మన తెలుగు వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బొల్తా పడడం వలన అనేక మంది కార్మికులు అక్కడిక్కడే మరణించిన సంఘటణ నన్ను మూర్చపోయేలా చేసాయి. * ఒక కార్మికుడైతే తను పనిచేస్తున్న ప్రదేశంలో సరయైనా రక్షణ లేని కారణంగా పై అంతస్తు నుండి కింద పడి అక్కడికక్కడే మరణించిన ద్రుష్యం గుర్తుకు వస్తేనే గుండెల్లో ఏదో తెలియని బాద మొదలవుతుంది.

గుండెల్లో చెప్పలేనంత భాదున్న పైకి అవేమి కనిపించకుండా వారి వారి కుటుంబాల గురించే నిత్యం పరితపిస్తూ బతికే గల్ఫ్‌ సోదరుల పరిస్థితులు తలచుకుంటేనే అయ్యోపాపం అని అనకుండా ఉండలేము.* ఆత్మహత్య లు చేసుకున్న పరిస్థితులు ,వారి వారి కుటుంబాల పరిస్థితులు మిత్రులతో పంచుకున్నప్పుడు అందరి కళ్ళల్లో కన్నీిల్లే ,కష్టాలే. పైకి మాత్రం ఎంతో ఆనందంగా కనిపించే జీవితాలు మా గల్ఫ్ అన్నల జీవితాలు.గల్ఫ్లో మరో అతి ముఖ్యమైన సమస్య కల్లివెల్లి . కల్లివెల్లి అయిన కార్మికుల కష్టాలైతే చెప్పనలవి కానివి.వీరికి పని దొరకదు, దొరికినా యజమానులు సరిగ్గా డబ్బులు ఇవ్వరు.అయినా ఎవ్వరిని గట్టిగా అడగ లేని పరిస్థితి ఇస్తే తీసుకోవడం లేదంటే అంతే.ఇలాంటి కార్మికులు నేడు ఎంత మంది అక్కడి జైల్లలో మగ్గుతున్నారో లెక్కే లేదు.ఇలా చెప్పుకుంటూ పోతే గల్ఫ్ అన్నల కష్టాలకు అంతేలేదు.నా 9 years గల్ఫ్ జిందగి విషేశాలు మీతో పంచుకోవడానికి ముఖ్యకారణం అక్కడ మన సోదరులు పడుతున్న కష్టాలు మీరు పడకూడదని,మీకు గల్ఫ్ వెళ్ళాలనే ఆలోచన ఉంటే తప్పకుండా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది.హిందీ, ఇంగ్లీషు భాషలలో నైపుణ్యం పెంచుకోవడం,అలాగే ఏదో పనిలో సరియైన శిక్షణ లేకుండా వెల్లకూడదు.శిక్షణ తీసుకుని వెల్లడం వలన తగిన జీతాలు ,వసతులు పొందే అవకాశం ఉంటుంది.మరో ముఖ్య విషయం ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడి చట్టాలపై అవగాహాణ కలిగి ఉండడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనుక గల్ఫ్ ప్రయాణం సుఖవంతంగా ,ఆనందంగా సాగుతుందన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.నా ఎడారి ప్రయాణం గాథ కొంత మందికైనా ఉపయోగ పడగగలిగితే అంతే చాలు.ప్రభుత్వాలు కూడ ఆలోచన చేసి గల్ఫ్ అన్నలు కోరుతున్న విధంగా NRI పాలసి ప్రకటించి వారి భాదలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నదే నా కోరిక.

మీ మల్యాల ‌శ్రీనివాస్

రాయికల్ మండలం ,

జగిత్యాల జిల్లా .తెలంగాణ రాష్ర్టం.

Cell : 7730846223

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here