కేంద్ర నిధులతో రాంజీగోండు స్మారక మ్యూజియం
జనజాతీయ గౌరవ దినోత్సవం ఆదివాసీలకు దక్కిన గౌరవం
గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు దోహదం-
తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి
కుంరం భీం మనుమడు సోనేరావుకు సన్మానం
హైదరాబాద్(నవంబరు 15): ఆదివాసీ యోధుడు బిర్సాముండా జయంతి రోజున దేశవ్యాప్తంగా జన జాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించడం ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవం, గుర్తింపుగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో ఇప్పటికే కుంరం భీం స్మారక మ్యూజియం నిర్మించగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో నిర్మల్‌లో రాంజీ గోండు స్మారక మ్యూజియం ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. నవంబరు 15న బిర్సాముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జన జాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియం సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కుంరం భీం మనుమడు కుంరం సోనేరావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గిరిజన సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. బిర్సాముండా, రాంజీగోండు, కుంరం భీం పోరాటాలు, త్యాగాలే నేటి గిరిజన ఆదివాసీ సమాజానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాయని కొనియాడారు. మా ప్రాంతం, మా వనరులు, మా రాజ్యం పేరుతో వారు చేసిన పోరాటాలకు గుర్తింపుగా నేడు విద్య, వైద్యంతోపాటు గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కుంరం భీం మనుమడు కుంరం సోనేరావును సత్కరించారు. అనంతరం సోనేరావు మాట్లాడుతూ కుంరం భీం స్మారక మ్యూజియం నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుంరం భీం, రాంజీగోండు పోరాటాలు స్వాతంత్ర పోరాటానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయని భావిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిస్తాయిలో ఆదివాసీ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధన సంస్థ(TCR&TI) ఆదివాసీ పోరాట యోధులు రాంజీ గోండు, కుంరం భీంల చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీలను మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించి వీక్షించారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుకొన్న విద్యార్థులలో 100 మందికిపైగా మంది ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతోపాటు, 60పైగా ఎంబీబీఎస్ అడ్మిషన్లు సాధించారని గిరిజన గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థలను మంత్రి చేతుల మీదుగా సత్కరించి అభినందించారు. కార్యక్రమానికి TCR&TI డైరెక్టరు సర్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించగా పత్రికా సమాచార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జాయింట్ డైరెక్టర్లు సముజ్వల, కళ్యాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.