వేసవి సెలవుల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ

0
70
Spread the love

వేసవి సెలవుల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ

కోవిడ్ అనంతరం తిరిగి సాధారణ పరిస్థితులు

అదనపు సిబ్బందితో భక్తులకు సేవలు

TOOFAN   ఏప్రిల్ 17, తిరుమ‌ల‌, 2022    –    కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రెండేళ్ల తర్వాత తిరుమలలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు కోవిడ్ ముందున్న స్థితికి చేరుకోవడంతో సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందించడం జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. తద్వారా సామాన్య భక్తులకు ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు టి, కాఫీ, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచారు.

ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నారు. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు వందమంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. లగేజీ కౌంటర్ల వద్ద శ్రీవారి సేవకులు కూడా సేవలు అందిస్తున్నారు. ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం పీస్ రేట్ క్షురకులతో కలిపి మొత్తం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారు. రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన వెంటనే తిరిగి శుభ్రం చేసి ఎప్పటికప్పుడు భక్తులకు కేటాయిస్తున్నారు.

తిరుమలలో రోజుకు 1700 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు. తిరుపతిలో మరో 300 మంది శ్రీవారి సేవలు స్థానిక ఆలయాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు వీరితో పాటు మరో 200 మంది పరకామణి సేవకులు సేవలు అందిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here