కమిటీ తీర్మానాలను బే ఖాతరు చేస్తే ఆందోళన తప్పదు

0
131
Spread the love

కమిటీ తీర్మానాలను బే ఖాతరు చేస్తే ఆందోళన తప్పదు

-టీయుడబ్ల్యుజె హెచ్చరిక

అక్రెడిటేషన్ల మంజూరీ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ (ఎస్.ఎల్.ఎమ్.ఏ.సి) చేసిన తీర్మానాలను సమాచార శాఖ అధికారులు కొందరు ఖాతరు చేయకుండా అగౌరవ పర్చుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వైఖరికి వారు స్వస్తి పలకకుంటే ఆందోళన తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ఒక ప్రకటనలో హెచ్చరించారు. మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన, ఆయా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులతో ఏర్పాటైన రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ…
సమాచార శాఖ సంచాలకులు, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు తదితర అధికారుల సమక్షంలో మూడు సార్లు సమావేశమై ఒక్కొక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అక్రెడిటేషన్ కార్డులను మంజూరీ చేసిందని వారు తెలిపారు. అంతేకాకుండా చిన్న, మధ్యతరగతి పత్రికలు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి కొన్ని తీర్మానాలను కమిటీ ఆమోదించిందని వారు పేర్కొన్నారు. ఆ నిర్ణయాలను వెంటనే అమలు పర్చుతామని సమావేశంలో ప్రకటించిన సమాచార శాఖ అధికారులు ప్రస్తుతం కమిటీని అగౌరవ పరిచే వ్యాఖ్యలు చేస్తుండడం, తీర్మానాలను పట్టించుకోక పోవడం సహించరానిదని శేఖర్, విరాహత్ అలీలు మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ నిర్ణయాలను అధికారులు గౌరవించనప్పుడు కమిటీ ఎందుకని వారు ప్రశ్నించారు. సమాచార శాఖ అధికారుల వైఖరి మూలంగా జిల్లాల్లో అక్రెడిటేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారిందని, డిపిఆర్వో లకు కూడా సరైన అవగాహన, స్పష్టత లేకుండా పోయిందని వారు విచారం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర కమిటీ నిర్ణయాలను అమలు చేయాలని, ఆ మేరకు సర్క్యూలర్లను ఆయా జిల్లాల కలెక్టర్లకు, డిపిఆర్వోలకు పంపించాలని, లేని పక్షంలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు చేపట్టడం, కమిటీల నుండి తమ సంఘం ప్రతినిధులు వైదొలగడం జరుగుతుందని వారు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here