“అమ్మ నాన్న” సంస్థ సేవలు అభినందనీయం
-టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్అలీ
చౌటుప్పల్: మే 11(TOOFAN) – ఏ దిక్కులేని అభాగ్యులకు పెద్ద దిక్కై ఆదరిస్తున్న అమ్మ నాన్న సేవా సంస్థ సేవలు అభినందనీయమని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ లో గల అమ్మ నాన్న అనాధల పుణ్య క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటి మనిషిని మనిషిగా గుర్తించ గలిగినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. తన వాళ్ళెవరో తెలియదు.
ఎక్కడి వారో తెలియదు… ఎండను, చలిని, వర్షాన్ని భరిస్తూ ఫుట్ ఫాత్ లపై పడివుంటూ చెత్తకుండీల్లో ఏరుకొని ఆకలి తీర్చుకునే ఆ మూగ మనుషులను మానవతావాదంతో అమ్మ నాన్న పుణ్య క్షేత్రం చెంత చేర్చుకొని వారికి నీడ కల్పించి, ఆకలి తీర్చడం గొప్ప సేవ అని ఆయన కొనియాడారు. 12ఏళ్ల క్రితం సామాజిక కార్యకర్త గట్టు శంకర్ నాటిన అమ్మ నాన్న మొక్కకు జర్నలిస్టుగా తాను కూడా నీళ్లు పోశానని, ఇవ్వాళ అది మహా వృక్షమై వందలాది మంది అభాగ్యులకు నీడ కల్పిస్తూ, వారి ఆకలి తీర్చడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని విరాహత్ అన్నారు. 20 మందితో ప్రారంభమైన ఈ పుణ్యక్షేత్రం నేడు దాదాపు 600 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ ఆశ్రమ నిర్వాహకులు శంకర్ పట్టుదల, నిస్వార్ధం, అంకితభావంతో రాత్రి పగలు శ్రమించినందువల్లే ఆశ్రమం ఈ స్థాయికి చేరిందన్నారు. ప్రతి మానవతావాది తమ వంతుగా ఇలాంటి సేవలకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విరాహత్ సూచించారు.