“స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం– సర్దార్ పటేల్ పాత్ర” పై వెబినార్

0
102
Spread the love

“స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం– సర్దార్ పటేల్ పాత్ర” పై వెబినార్

హైదరాబాద్, 29 అక్టోబర్ 2021 – జాతీయ సమైక్యత నెలకొల్పడానికి సర్దార్ వల్లభభాయి పటేల్ చేసిన ప్రయత్నం హిమాలయ శిఖరం తో సమానమని జె. లక్ష్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల (మహబూబ్ నగర్) అన్నారు. పత్రికా సమాచార కార్యాలయం, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యం లో “స్వతంత్ర భారత దేశంలో హైదరాబాద్ సంస్థానాల విలీనం – సర్దార్ పటేల్ పాత్ర” పై ఏర్పాటు చేసిన వెబినార్ లో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్- 75 వసంతాల స్వాతంత్ర్య సంబరాలను మనం ఎంతో ఘనంగా ప్రతీ ఊరిలో జరుపుకుంటున్నామని, భారత జాతీయ విలువలను, పోరాట పటిమలను జాతికి, ముఖ్యంగా యువతకు తెలియజేసే ఉద్ధేశ్యం జరుగుతుందని, ఈ సందర్భంలో జాతీయ ఐక్యతా దినోత్సవం- అక్టోబర్ 31వ తేదీ, సర్దార్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆ మహానీయుడి గురించి మాట్లాడుకోవడం మనందరికీ గర్వ కారణమని ఆయన అన్నారు.

నెహ్రూ, గాంధీలు దేశానికి రెండు కళ్ళ లాంటి వారైతే, సర్దార్ పటేల్ దేశానికి గుండె లాంటి వారని, ఆ గుండె ధృడ చిత్తంతోనే 565 సంస్థానాలు గా ఉన్న దేశం సమైక్య భారతం గా ఏర్పడిందని లక్ష్మయ్య గుర్తు చేశారు. ఈనాటి సువిశాల భారతదేశపు రూపురేఖలను కలగని, ఆ కలను నిజం చేసి చూపిన మహానాయకుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. ఆ ఉక్కు మనిషి ఆధునిక భారతావనికి ఆది శిల్పి. ఆయన దృఢ సంకల్పం, ధైర్యసాహసాలే లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత సంస్థానం లో విలీనమై ఉండకపోయేది. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో అస్తవ్యస్థంగా ఉన్న భారతదేశపు పరిస్థితులను త్రోసిరాజని వివిధ సంస్థానాలు తమ ఉనికిని స్వతంత్ర భారతదేశంలో కూడా నిలుపుకోవాలనుకున్నాయి. సర్దార్ పటేల్ వారి కుట్రలను, కుయుక్తులను ఛేదించి ఆ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి విశాల భారతాన్ని నెలకొల్పాడు.

అయితే, అన్ని సంస్థానాల కంటే పెద్దదిగా ఉన్న హైదరాబాద్ భారత్ లో కలవడానికి సిద్ధపడలేదు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా స్వతంత్రంగా ఉండటానికి భీష్మించుకున్న నిజాంకు పటేల్ అనునయ వ్యాఖ్యలు రుచించలేదు. చివరగా భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యకు దిగాల్సి వచ్చింది. మూడు రోజుల పోరులో ఓటమిని అంగీకరించిన నిజాం హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేశాడు. ఇది జరిగింది 1949 సెప్టెంబర్ 17న. ఈ విధంగా స్వతంత్ర భారతంలో జరిగిన రాచరిక రాజ్యాల విలీన ప్రక్రియను సర్దార్ పటేల్ ‘రక్తరహిత విప్లవం’గా అభివర్ణించారు. ప్రపంచ చరిత్రలో జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిదో విశాల భారత నిర్మాణంలో పటేల్ భూమిక అలాంటిది. అందుకే ఆయనకు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి బిరుదును అందించారు. దేశ స్వాతంత్య్రం తరువాత అఖిల భారత సివిల్ సర్వీసులను దేశ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించేలా పునర్ వ్యవస్థీకరించిన ఘనత పటేల్ కు దక్కుతుందని లక్ష్మయ్య అన్నారు.

దేశాన్ని ముక్కలు కాకుండా నిలువరించి ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ గా ఆవిష్కృతం చేసిన ‘ఏకతామూర్తి’ సర్దార్ పటేల్. ఆయన మార్గాన్ని ఈనాటి తరం అనుసరించేలా భారత ప్రభుత్వం 2014 నుండి అక్టోబర్ 31 ని ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ గా ప్రకటించిందని లక్ష్మయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన అధికారులు , సిబ్బంది, విద్యార్థులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here